Friday, 4 November 2016

Non Vegetable cooking items ( రుచి - అభిరుచి , నాన్ వెజ్ వంటకాలు) - 1

చీజ్‌ ఆమ్లెట్‌

కావలసినవి
కోడిగుడ్లు: రెండు, ఉల్లిముక్కలు: పావుకప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు: పావుకప్పు, ఉప్పు: కొద్దిగా, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: 2 టీస్పూన్లు, చీజ్‌: సుమారు పావుకప్పు(రుచికి సరిపడా కూడా వేసుకోవచ్చు), కారం: పావుటీస్పూను, పసుపు: చిటికెడు, గరంమసాలా: పావుటీస్పూను, పుదీనా, సోయకూర తురుము: కొద్దికొద్దిగా(ఇష్టమైతేనే)
తయారుచేసే విధానం
ఓ చిన్న గిన్నెలో గుడ్లసొన వేసి బాగా గిలకొట్టాలి.
నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి ఉల్లిముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. తరవాత గరంమసాలా, పసుపు, కారం, కొత్తిమీర తురుము, పుదీనా, సోయకూర తురుము అన్నీ వేసి కలిపి వేయించి తీసి గిలకొట్టిన గుడ్డుసొనలో వేసి కలపాలి. ఇప్పుడు మరో టీస్పూను నూనె పాన్‌లో వేసి మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసి రెండువైపులా కాలాక ఒకవైపున చీజ్‌ తురుము చల్లి అది కరిగేవరకూ సిమ్‌లో ఉంచి దించాలి.

ముత్తా అవియల్‌

కావలసినవి
ఉడికించిన గుడ్లు: 4, బంగాళాదుంపలు: రెండు, చింతపండు గుజ్జు: 4 టేబుల్‌స్పూన్లు లేదా టొమాటోగుజ్జు: కప్పు, కొబ్బరితురుము: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, వెల్లుల్లిరెబ్బలు: రెండు, పసుపు: పావు టీస్పూను, కారం: టీస్పూను, ఆవాలు: ముప్పావుటీస్పూను, జీలకర్ర: టీస్పూను, మినప్పప్పు: అరటీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
బంగాళాదుంపల్ని పొట్టు తీసి ముక్కలుగా కోయాలి.
ఓ బాణలిలో కొబ్బరి తురుము, వెల్లుల్లిరెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించి తీసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించాలి.
నాన్‌స్టిక్‌ పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి కాగాక, బంగాళా దుంప ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తరవాత మసాలా ముద్ద వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు చింతపండు లేదా టొమాటో గుజ్జు, ఉప్పు, కారం వేసి కలిపి సుమారు పావుగంటసేపు ఉడికించాలి. తరవాత ఉడికించిన కోడిగుడ్లను సగానికి కోసి కూర మిశ్రమంలో వేసి కదపకుండా మూత పెట్టి సిమ్‌లో సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి.
విడిగా ఓ చిన్న పాన్‌లో టేబుల్‌స్పూను నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, జీలకర్ర వేసి తాలింపు చేసి కూరలో కలిపి వడ్డిస్తే కేరళ ముత్తా అవియల్‌ కూర రెడీ.

మటన్‌ దాల్‌ ఘోస్ట్‌

కావలసినవి:
మసూర్‌దాల్‌: కప్పు, బోన్‌లెస్‌ మటన్‌: కిలో, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 4 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు: రెండు, అల్లంముద్ద: టేబుల్‌స్పూను, వెల్లుల్లిముద్ద: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్రపొడి: టీస్పూను, పసుపు: అరటీస్పూను, గరంమసాలా: టీస్పూను, నిమ్మకాయ: ఒకటి, కొత్తిమీర తురుము: అలంకరణకు సరిపడా
తయారుచేసే విధానం:
ప్రెషర్‌ కుక్కర్‌లో మటన్‌ముక్కలు, పప్పు, ఉప్పు, రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి మెత్తగా ఉడికించాలి.
మరో పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్లు నూనె వేసి ఉల్లిపాయలు బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించాలి. అందులోనే అల్లం ముద్ద, వెల్లుల్లి ముద్దలు వేసి ఓ నిమిషం వేయించాలి. అందులోనే దనియాలపొడి, జీలకర్రపొడి, కారం, గరంమసాలా వేసి నూనె తేలేవరకూ వేయించాలి. ఇందులో పప్పు-మటన్‌ ముక్కల మిశ్రమం వేసి కలిపి మరో పది నిమిషాలు సిమ్‌లో ఉడికించి దించాలి. ఇప్పుడు నిమ్మరసం వేసి కలిపి కొత్తిమీరతో అలంకరిస్తే సరి.

మటన్‌ వేపుడు

కావలసినవి:
మటన్‌: అరకిలో, వెల్లుల్లిరెబ్బలు: పది, పసుపు: టీస్పూను, గరంమసాలా: టేబుల్‌స్పూను, పెరుగు: కప్పు, పలావుఆకులు: రెండు, ఆవనూనె: కప్పు, అల్లంతురుము: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేసే విధానం:
పెరుగుని బాగా గిలకొట్టాలి.
మటన్‌ ముక్కలకు టేబుల్‌స్పూను నూనె, పసుపు, ఉప్పు, పెరుగు పట్టించి రెండు గంటలు నాననివ్వాలి.
బాణలిలో నూనె పోయాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి, పలావు ఆకులు వేసి ఓ నిమిషం వేయించాలి. తరవాత అన్నీ పట్టించిన మటన్‌ ముక్కలు వేసి సిమ్‌లో ఉంచి ఉడికించాలి. చివరగా గరంమసాలా వేసి బాగా కలిపి దించాలి.

బొప్పాయి ముద్ద‌తో మ‌ట‌న్ క‌ర్రీ

కావల్సినవి: 
మటన్‌ ముక్కలు - రెండు కప్పులు, పచ్చి బొప్పాయి ముద్ద - చెంచా, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర చెంచా, కారం, గరంమసాలా - చెంచాచొప్పున, ఉప్పు - తగినంత, జీలకర్రపొడి - చెంచా, నూనె - పావుకప్పు, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు, టొమాటోలు - రెండు, జీడిపప్పు పేస్టు - రెండున్నర చెంచాలు, మటన్‌ ఉడికించిన నీరు - రెండుకప్పులు.
తయారీ:
బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అవి ఎర్రగా వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కలు వేయాలి. అవి వేగాక మటన్‌ ఉడికించిన నీరూ, మటన్‌ ముక్కలు వేయాలి. ఆ నీళ్లు ఆవిరిపోయేవరకూ మంట తగ్గించి ఉంచాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ రావాలి. ఐదు నిమిషాల తరవాత దింపేయాలి. వీటిని రొట్టెలతో కలిపి వడ్డించాలి.

రొయ్యల కిచిడీ

కావల్సినవి:
శుభ్రం చేసి, కారం, ఉప్పు పట్టించిన రొయ్యలు - కప్పు, పసుపు - అరచెంచా, సాంబార్‌ పొడి - చెంచా, పచ్చిమిర్చి తరుగు - చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా, ఉప్పు - తగినంత, కరివేపాకు రెబ్బలు - రెండు, టొమాటో, బంగాళాదుంప - ఒక్కోటి చొప్పున, కొబ్బరితురుము - రెండు చెంచాలు, ఉల్లిపాయలు - రెండు, బియ్యం - రెండుకప్పులు, నానబెట్టిన పెసరపప్పు - టేబుల్‌స్పూను, మినప్పప్పు - టేబుల్‌స్పూను(నానబెట్టుకోవాలి), నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ:
కుక్కర్‌ని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఉల్లిపాయముక్కలు వేయించాలి. అవి వేగాక పచ్చిమిర్చి తరుగూ, అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలూ, కరివేపాకు రెబ్బలూ, కొబ్బరితురుమూ, బంగాళాదుంప ముక్కలూ, రొయ్యలు వేయాలి. రొయ్యలు కొద్దిగా వేగాయనుకున్నాక కడిగిన బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు, తగినంత ఉప్పూ, పసుపూ, సాంబార్‌పొడి, నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేయాలి. మూడు కూతలు వచ్చాక దింపేస్తే చాలు. 

No comments:

Post a Comment