Friday, 4 November 2016

Cakes & Bakery Items ( రుచి - అభిరుచి , కేక్స్ & బేకరి ఐటమ్స్)

రబడీ మిల్లీ

కావల్సినవి: పఫ్‌ పేస్ట్రీ - అరకేజీ (బేకరీల్లో దొరుకుతుంది), రబడీ - రెండు కప్పులు, పాలు - పావుకప్పు, ఐసింగ్‌ షుగర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు.
రబడీకోసం: చిక్కని పాలు - లీటరు, చక్కెర - పావుకప్పు, యాలకులపొడి - చిటికెడు, గులాబీ ఎసెన్స్‌ - కొన్ని చుక్కలు.
తయారీ: ముందుగా రబడీ తయారు చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి ఒకసారి మరిగాక మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. పాలు పావు వంతు ఆవిరైపోయాక చక్కెరా, యాలకులపొడీ వేయాలి. చక్కెర పూర్తిగా కరిగి పాలు సగం అయ్యాక గులాబీ ఎసెన్స్‌ వేసి దింపేయాలి. దీన్ని ఓ గంట ఫ్రిజ్‌లో ఉంచితే రబడీ తయారైనట్లే. ఇప్పుడు ఓవెన్‌ని 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసుకుని పెట్టుకోవాలి. పఫ్‌ పేస్ట్రీని మందంగా చపాతీలా వత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు దీర్ఘచతురస్రాకారంలో కోసి బేకింగ్‌షీట్‌పై ఉంచాలి. వీటిని పదిహేను నిమిషాలు బేక్‌చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు రబడీలో పాలు పోసి గిలకొట్టాలి. పేస్ట్రీని మధ్యలో కోసి ఒకదాన్ని ప్లేటులో ఉంచి పైన రబడీ వేయాలి. దానిపై మరో పేస్ట్రీ స్లైసును ఉంచి... ఇంకాస్త రబడీ వేయాలి. ఇలా మూడు వరసలు చేసుకుని పైన ఐసింగ్‌ షుగర్‌ వేసి గట్టిగా నొక్కాలి.

మ‌ట‌న్‌తో కేక్‌ 

కావల్సినవి:  వండిన మటన్‌ - కప్పు, ఉల్లిపాయలు - రెండు (ముక్కల్లా కోయాలి), పచ్చిమిర్చి - మూడు (తరగాలి), సన్నగా తరిగిన అల్లం,వెల్లుల్లి ముక్కలు - అరటేబుల్‌స్పూను చొప్పున, కారం - అరచెంచా, పసుపు - పావుచెంచా, కొత్తిమీర తరుగు - టేబుల్‌స్పూను, గుడ్లు - మూడు, పాలు - అరకప్పు, మైదా - అరకప్పు, మిరియాలపొడి - పావుచెంచా, ఉప్పు - తగినంత, నూనె - పావుకప్పు, నెయ్యి - టేబుల్‌స్పూను.
తయారీ:ఉడికించి పెట్టుకున్న మటన్‌ని మెత్తని ముద్దలా చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేయాలి. రెండుమూడు నిమిషాలయ్యాక కారం, కొద్దిగా ఉప్పూ, పసుపూ ముందుగా ఉడికించిపెట్టుకున్న మటన్‌, కొత్తిమీరనూ వేసి బాగా కలపాలి. ఇది కూరలా తయారయ్యాక దింపేయాలి. ఇప్పుడు గుడ్లసొనా, పాలూ, మైదా, తగినంత ఉప్పూ, మిరియాలపొడీ మిక్సీ జారులోకి తీసుకుని మిక్సీ పట్టాలి. అన్నీ కలిశాయానుకున్నాక విడిగా తీసుకోవాలి. కుక్కర్‌లో పెట్టాలనుకున్న గిన్నెకు నెయ్యి రాయాలి. ఇందులో ముందుగా గుడ్డు మిశ్రమం, దానిపై మటన్‌ కూరను పరిచినట్లు వేసి మూత పెట్టేయాలి. మంట తగ్గించి వెయిట్‌ పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉంచి తరవాత దింపేయాలి. ఈ మిశ్రమం మధ్యలో టూత్‌పిక్‌ గుచ్చి ఇవతలకు తీయాలి. టూత్‌పిక్‌కు మిశ్రమం అంటుకోకపోతే అయిపోయినట్లే. ఆ గిన్నెను ఓ పళ్లెంలో బోర్లా ఉంచితే.. కేక్‌ ఇవతలకు వచ్చేస్తుంది. కావల్సిన ఆకృతిలో ముక్కల్లా కోసుకుంటే చాలు.

స్ట్రాబెర్రీ స్పాంజ్‌ కేక్‌

కావలసినవి: మైదాపిండి: 200గ్రా., పంచదార: 200గ్రా., కోడిగుడ్లు: ఆరు, బేకింగ్‌ పౌడర్‌: పావుటీస్పూను, వెనీలాపౌడర్‌: టీస్పూను, స్ట్రాబెర్రీ ఫుడ్‌ కలర్‌: కొద్దిగా, స్ట్రాబెర్రీ ఎసెన్స్‌: 2 టీస్పూన్లు.
స్పాంజ్‌ మధ్యలో పెట్టేందుకు: పంచదారపాకం: అరలీటరు, గిలకొట్టిన క్రీమ్‌: అరకిలో, స్ట్రాబెర్రీ క్రష్‌: 400 మి.లీ., తాజా స్ట్రాబెర్రీలు: పావుకిలోపైన అలంకరించేందుకు: తాజా స్ట్రాబెర్రీలు: పావుకిలో, గిలకొట్టిన క్రీమ్‌: 200 గ్రా.
తయారుచేసే విధానం
కోడిగుడ్లలోని పచ్చసొననీ తెల్లసొననీ వేరుచేయాలి. తెల్లసొనలో పంచదార వేసి బాగా గిలకొట్టాలి. పచ్చసొనలో వెనీలాపొడి, స్ట్రాబెర్రీ ఎసెన్స్‌, స్ట్రాబెర్రీ ఫుడ్‌ కలర్‌, బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలపాలి. తరవాత రెండు సొనల మిశ్రమాలను కలపాలి. మిశ్రమాన్ని కేకు గిన్నెలో పోసి 190 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర సుమారు 15 నిమిషాలపాటు బేక్‌ చేయాలి. స్పాంజ్‌ కేక్‌ చల్లారాక దాన్ని సరిగ్గా మధ్యలోకి రెండుగా కోసి, రెండింటి మీదా పంచదార పాకం పోయాలి. ఇప్పుడు ఒక భాగం కేకు మీద క్రీమ్‌ను పరచాలి. తరవాత స్ట్రాబెర్రీ క్రష్‌ వేసి, స్ట్రాబెర్రీలను పేర్చాలి. దానిమీద మరో సగాన్ని పెట్టాలి. ఇప్పుడు పైన అలంకరించేందుకు తీసుకున్న క్రీమ్‌ను పరచాలి. దానిమీద లవ్‌ఫ్రూట్‌ (స్ట్రాబెర్రీ)లతో అలంకరిస్తే సరి.

చికెన్‌తో పాన్‌కేక్‌

కావల్సినవి:పాన్‌కేక్‌ కోసం: మైదా - యాభై అయిదు గ్రా, ఉప్పు -చిటికెడు, కోడిగుడ్డు - ఒకటి, పాలు - 140 ఎంఎల్‌, నూనె - సరిపడా, ఉల్లి కాడలు - మూడు (ఉల్లిపాయల్ని చక్రాల్లా తరగాలి), ఎండలోఎండబెట్టిన టమాటాలు - నాలుగు, ఆవిరి మీద ఉడికించిన చికెన్‌ - ఎనభై గ్రా. 
చీజ్‌ సాస్‌ కోసం: వెన్న, మైదా - 25 గ్రా చొప్పున, పాలు - 225 ఎంఎల్‌, చీజ్‌ - వంద గ్రా, తాజా మిరియాలపొడి - రుచికి సరిపడా.

తయారీ:మైదా, ఉప్పును ఓ పాత్రలోకి తీసుకోవాలి. మరో పాత్రలో కోడిగుడ్డు, పాలను తీసుకుని బాగా గిలక్కొట్టి మైదాలో కలపాలి. చీజ్‌ సాస్‌ కోసం వెన్నను కరిగించి మైదా పిండిలో చేర్చి బాగాగిలక్కొట్టాలి. దీన్ని పొయ్యిమీద పెట్టి నిమిషమయ్యాక పాలు చేర్చాలి. ఈ మిశ్రమం దగ్గరగా అయ్యేదాకా ఉంచి ఆ తరవాత చీజ్‌, మిరియాల పొడి కలిపి దింపేయాలి. ఇప్పుడు పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని సగం గరిటెడు వేసి.. పెనాన్ని అటూఇటూ తిప్పాలి. అర నిమిషమయ్యాక పాన్‌కేక్‌ను తిరగేయాలి. పాన్‌కేక్‌ సిద్ధమయ్యాక కొద్దిగా చికెన్‌ చక్రాల్లా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు పరిచి దానిపై చీజ్‌ వేయాలి. దీన్ని పళ్లెంలోకి తీసుకుంటే సరిపోతుంది. వేడివేడి చికెన్‌ సేవరీ పాన్‌ కేక్‌లు నోరూరిస్తాయి.
చాక్‌ చిప్‌ పీనట్‌ బటర్‌తో పాన్‌ కేక్‌
కావల్సినవి:మైదా - 140 గ్రా, వెన్న తీయని పాలు - 200 ఎంఎల్‌,కోడిగుడ్లు - రెండు, ఉప్పులేని వెన్న - 25 గ్రా (కరిగించాలి), ఉప్పు - చిటికెడు. ఫిల్లింగ్‌ కోసం: పీనట్‌ బటర్‌ - 6 టేబుల్‌ స్పూన్లు, ఐసింగ్‌ షుగర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, పాలు - రెండు టేబుల్ స్పూన్లు, చాక్లెట్‌ చిప్స్‌ - యాభై గ్రా, చక్రాల్లా తరిగిన అరటిపండు ముక్కలు - నాలుగైదు. 

తయారీ:మైదాలో ఉప్పు వేసి బాగా కలపాలి. మరో పాత్రలో పాలు, పావుకప్పు నీళ్లు కలిపి పెట్టుకోవాలి. కోడిగుడ్ల సొన తీసుకుని నెమ్మదిగా గిలక్కొట్టాలి. అందులో పాలు చేర్చి.. కలిశాక మైదా వేయాలి. పిండి తయారయ్యాక అరగంట నాననివ్వాలి. ఆ తరవాత కరిగించిన వెన్న కలపాలి. ఇప్పుడు పెనం వేడిచేసి కరిగించిన వెన్నను కొద్దిగా రాసి రెండు టేబుల్‌స్పూన్ల పిండి వేసి దోశలా రాయాలి.ఎర్రగా వేగాక తీయాలి. మిగతా పిండినీ పాన్‌కేక్‌లు వేసుకోవాలి. చిరగా ఫిల్లింగ్‌ కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నింటినీ కలిపి పాన్‌కేక్‌లపై పరిచి అరటిపండు ముక్కను ఉంచి వడ్డించాలి.

పాలు-కోడిగుడ్లతో హల్వా

కావల్సినవి:కోడిగుడ్లు - నాలుగు, పాలు - పావులీటరు, పంచదార - నూటయాభై గ్రా, నెయ్యి - యాభై గ్రా,కుంకుమపువ్వు రేకలు- చిటికెడు, ఆకుపచ్చ యాలకులు - మూడు, దాల్చినచెక్కపొడి - గ్రా,ఎండుద్రాక్ష, పిస్తా, బాదం పలుకులు -పది గ్రా చొప్పున.

తయారీ:కోడిగుడ్ల సొనను ఓ పాత్రలోకి తీసుకుని బాగా గిలక్కొట్టాలి. పాలను మరో పాత్రలో మరిగించి పంచదార, యాలకులపొడి, దాల్చినచెక్కపొడి చేర్చి సగమయ్యేదాకా మళ్లీ మరిగించాలి. ఆ తరవాతకోడిగుడ్ల సొన చేర్చి.. పలుకుల్లా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఇందులో నెయ్యి, ఎండుద్రాక్ష; కుంకుమ పువ్వు పొడి కలపాలి. నీళ్లు ఆవిరైపోయేదాకా పొయ్యిమీద ఉంచి తరవాత దింపేయాలి. అంతే.. బాదం, పిస్తా పలుకులతో అలంకరిస్తే.. కమ్మని పాల హల్వా సిద్ధం. 

రాగిపిండితో కేక్‌

కావల్సినవి:రాగిపిండి, వెన్న, పంచదార - కప్పు చొప్పున, కోడిగుడ్లు 
- మూడు, వెనిల్లా ఎసెన్సు - చెంచా, వంటసోడా - అరచెంచా.
తయారీ:రాగిపిండిలో వంటసోడా కలిపి ఆ తరవాత జల్లించాలి. కోడిగుడ్ల సొనను మరో పాత్రలోకి తీసుకొని గిలక్కొట్టాలి. ఇప్పుడు రాగిపిండిలో వెన్న, పంచదార, గిలక్కొట్టిన సొన చేర్చి పంచదార పూర్తిగా కలిసే దాకా కలపాలి. ఆ తరవాత వెనిల్లా ఎసెన్సు చేర్చాలి. ఒవెన్‌ను ముందుగా వేడిచేసి.. ఈ మిశ్రమాన్ని డాల్డా రాసిన కేకు పాత్రలోకి మార్చుకుని బేక్‌ చేయాలి. కనీసం అరగంట ఉంచితే.. కమ్మని కేక్‌ సిద్ధమవుతుంది.

కప్‌కేక్‌ల మజా

కావల్సినవి:కప్‌కేక్‌లు - పన్నెండు, మామిడిపండు - ఒకటి, మామిడి జామ్‌ - రెండు చెంచాలు, గిలక్కొట్టిన క్రీం - కప్పు.
తయారీ:మామిడి పండు చెక్కు తీసి సన్ననిముక్కల్లా కోసి జామ్‌ కలిపి పెట్టుకోవాలి. పదినిమిషాలయ్యాక కప్‌కేక్‌ల లోపలి భాగాన్ని తొలగించి మామిడి మిశ్రమాన్ని నింపాలి. పైన గిలక్కొట్టినక్రీంను అలంకరిస్తే కప్‌కేక్‌లను తినేయడమే ఆలస్యం. మామిడి మాత్రమే కాదు.. కాలానుగుణంగా లభించే పండ్లతోనూ ఇలాంటి ప్రయోగాలు చేయవచ్చు.
బ్రెడ్‌ శాండ్‌విచ్‌ ఫ్రైటర్‌ ఛాట్‌
కావల్సినవి:బ్రెడ్‌ స్లైసులు - ఆరు, ఉడికించిన బంగాళాదుంపలు - రెండు, 
ఉడికించిన పచ్చిబఠాణీ - అరకప్పు, ఛాట్‌మసాలా పొడి - చెంచా, కారం - అరచెంచా, కొత్తిమీర తరుగు - అరచెంచా, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, వంటసోడా - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా, తీపి పెరుగు - రెండు టేబుల్‌స్పూన్లు( కొద్దిగా చక్కెర కలిపి గిలకొట్టాలి), చింతపండు చట్నీ - టేబుల్‌స్పూను.
తయారీ:ఓ గిన్నెలో బంగాళాదుంపలు, పచ్చిబఠాణీ, ఛాట్‌మసాలా, కారం, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర తీసుకుని బాగా కలపాలి. తరవాత ఒక బ్రెడ్‌ స్లైసుని తీసుకుని ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి పైన మరో స్లైసు ఉంచేయాలి. ఇలా మిగిలిన స్లైసుల్ని కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో సెనగపిండి, వంటసోడా, తగినంత ఉప్పు వేసుకుని నీళ్లతో మరీ పలుచగా కాకుండా దోశపిండిలా కలిపి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బ్రెడ్‌స్లైసుల్ని సెనగపిండి మిశ్రమంలో ముంచి అందులో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. ఈ స్లైసుల్ని ఓ ప్లేటులోకి తీసుకుని వాటిపైన కొద్దిగా చింతపండు చట్నీ, పెరుగు వేస్తే సరిపోతుంది.
చైనా గ్రాస్‌ జున్ను
కావల్సినవి:చిక్కని పాలు - అరలీటరు, చైనాగ్రాస్‌ - పది గ్రా 
(ఇది బజార్లో లభిస్తుంది), యాలకుల పొడి -చెంచా, సారపప్పు, దోసగింజల పలుకులు -టేబుల్‌ స్పూను, పైనాపిల్‌, అనాస ముక్కలు - రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార - కప్పు, నీళ్లు - గ్లాసు.
తయారీ:వేడినీటిలో చైనా గ్రాస్‌ని ముక్కల్లా చేసుకుని వేయాలి. అది కరిగేవరకు పొయ్యిమీద ఉంచి కలుపుతూ ఉండాలి. మరో పొయ్యిమీద పాలను విడిగా మరిగించుకుని పంచదార కలపాలి. ఇందులో చైనాగ్రాస్‌ మిశ్రమాన్ని చేర్చి రెండుమూడు పొంగులు వచ్చేదాకా పొయ్యిమీద ఉంచి కలుపుతూ ఉండాలి. కాసేపటికి పాలు చిక్కగా అవుతాయి. మిశ్రమం దగ్గరగా అయ్యాక యాలకుల పొడి, సారపప్పు, దోసగింజల పలుకులు, పండ్ల ముక్కలు వేసి ఓ పళ్లెంలోకి మార్చుకోవాలి. అరగంటకు ఇది చల్లారుతుంది. అప్పుడు ముక్కల్లా కోసుకుంటే సరిపోతుంది. ఆసక్తిని బట్టి పండ్లముక్కలు లేదా నట్స్‌తో అలంకరించుకోవచ్చు.
కార్న్‌ కేక్‌
కావలసినవి:కార్న్‌మీల్‌: కప్పు, మైదా: 3 కప్పులు, పంచదార: 
2 కప్పులు, బేకింగ్‌ పౌడర్‌: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు:అర టీస్పూను, వెన్న: కప్పు, తేనె: 2 టేబుల్‌స్పూన్లు, గుడ్లు: నాలుగు, పాలు: రెండున్నర కప్పులు
తయారుచేసే విధానం:ఓవెన్‌ను 350 డిగ్రీల ఫారన్‌హీట్‌కు వేడి చేయాలి.గిన్నెలో కార్న్‌మీల్‌, మైదా, పంచదార, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి బాగా కలపాలి. తరవాత కరిగించిన వెన్న, తేనె, గుడ్లసొన, పాలు పోసి గిలకొట్టినట్లుగా కలపాలి. మిశ్రమాన్ని నెయ్యి రాసిన బేకింగ్‌ ట్రేలో వేసి సుమారు 45 నిమిషాలు బేక్‌ చేసి తీయాలి.
నగ్గెట్స్‌
కావలసినవి:నూనె: పావుకప్పు, డార్క్‌ చాకొలెట్‌: 100గ్రా.,
పంచదార: కప్పు, గుడ్లు: రెండు, వెనీలా ఎసెన్స్‌: టీస్పూను, మైదా: కప్పు, బేకింగ్‌ పౌడర్‌: టీస్పూను
తయారుచేసే విధానం:పాన్‌లో నూనె వేసి సిమ్‌లో పెట్టి చాకొలెట్‌ తురుము వేసి అది కరిగేవరకూ తిప్పుతూ ఉండాలి.ఓ గిన్నెలో చాకొలెట్‌ మిశ్రమం వేసి పంచదార, గుడ్లసొన, వెనీలా ఎసెన్స్‌ వేసి బాగా బీట్‌ చేయాలి.తరవాత మైదా, బేకింగ్‌ పౌడర్‌ కూడా వేసి బాగా గిలకొట్టి పిండిని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి.మర్నాడు ఓవెన్‌ను 350 డిగ్రీలకు వేడి చేసి కుకీస్‌ షీటులో పార్చ్‌మెంట్‌ పేపర్‌ వేసి నెయ్యి రాసి ఉంచాలి. విడిగా గిన్నెలో పంచదార వేయాలి. పిండి మిశ్రమాన్ని చేత్తో తీసుకుని గుండ్రని ఉండల్లా చేసి పంచదారలో దొర్లించి నెయ్యి రాసిన కుకీస్‌ షీటుమీద కాస్త దూరం దూరంగా ఉంచి సుమారు 10 నిమిషాలు బేక్‌ చేసి తీయాలి.
ఫ్రూట్‌ కేక్‌
కావలసినవి:గుడ్లు: నాలుగు, మైదాపిండి: 200గ్రా., పంచదార: 200గ్రా., 
బేకింగ్‌ పౌడర్‌: 2 టీస్పూన్లులోపల నింపేందుకూ అలంకరించేందుకూ: బాదం: 100గ్రా., క్రీమ్‌: 200మి.లీ., పంచదార: కప్పు, తాజాపండ్ల ముక్కలు (ద్రాక్ష, పైనాపిల్‌, యాపిల్‌, నారింజ, దానిమ్మగింజలు): 3 కప్పులు
తయారుచేసే విధానం:ఓవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడుకి వేడి చేసి ఉంచాలి. కేక్‌ మిక్సింగ్‌ బౌల్‌లో గుడ్ల సొన, మైదాపిండి, పంచదార, బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా గిలకొట్టాలి. మిశ్రమాన్ని రెండు వేర్వేరు టిన్నుల్లో పోసి సుమారు 35 నుంచి 45 నిమిషాలు బేక్‌ చేయాలి. ఆఫ్‌ చేశాక ఓ ఐదు నిమిషాలు అలానే ఉంచి తీసి చల్లార్చాలి బాదం వేయించి చల్లారాక సన్నని ముక్కల్లా కోయాలి. క్రీమ్‌లో పంచదార వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు ఓ కేక్‌ను తీసుకుని తలకిందులుగా చేయాలి. దానిమీద క్రీమ్‌ పరిచినట్లుగా రాయాలి. దానిమీద సగం పండ్లముక్కలు పరచాలి. బాదం ముక్కలు చల్లాలి. ఇప్పుడు మరో కేక్‌ను కూడా ముందులానే తీసుకుని దానిమీద ముందు మిగిలిన పండ్లముక్కలు పరిచి, బాదం చల్లి, వాటిమీద క్రీమ్‌ రాయాలి. ఇప్పుడు ఈ కేక్‌ను కిందకి తిప్పి, మొదటి కేక్‌మీద పెట్టి అదమాలి. తరవాత మిగిలిన క్రీమ్‌ను కేక్‌ పైనా చుట్టూ పలుచని పొరలా పూసి పండ్లముక్కలతో అందంగా అలంకరించాలి.

No comments:

Post a Comment