Friday, 4 November 2016

Vegitable cooking Items ( రుచి & అభిరుచి - వెజ్ వంటకాలు)

కట్టా ఆలూ

కావలసినవి
బంగాళాదుంపలు: నాలుగు, జీలకర్రపొడి: పావుటీస్పూను, షాజీరా: పావుటీస్పూను, జీలకర్ర: ముప్పావుటీస్పూను, దనియాలపొడి: పావుటీస్పూను, ఉల్లితురుము: అరకప్పు, వెల్లుల్లి తురుము: టీస్పూను, పచ్చిమిర్చి: రెండు, అల్లంతురుము: టీస్పూను, పసుపు: టీస్పూను, కారం: టీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, పుదీనా తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నిమ్మకాయ: ఒకటి, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: అరటీస్పూను
తయారుచేసే విధానం
బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, షాజీరా, దనియాలపొడి వేసి మంచి వాసన వచ్చేవరకూ వేయించాలి. తరవాత ఉల్లిపాయముక్కలు వేసి ఓ నిమిషం వేయించాలి. తరవాత అల్లం, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి వేయించాలి. ఇప్పుడు పొట్టు తీసి కోసిన బంగాళాదుంప ముక్కలు వేసి మగ్గనివ్వాలి. అవి మెత్తబడ్డాక ఉప్పు, మిరియాలపొడి, కారం వేసి వేయించాలి. చివరగా పుదీనా తురుము, కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసి కలిపి దించాలి.

చిలగడదుంప కూర

కావలసినవి
చిలగడదుంపలు: అరకిలో, టొమాటో: మూడు, పచ్చిమిర్చి: రెండు, పెరుగు: అరకప్పు, కొత్తిమీర తురుము: 3 టేబుల్‌స్పూన్లు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: అరటీస్పూను, ఇంగువ: చిటికెడు, పసుపు: పావు టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, కారం: పావుటీస్పూను, గరంమసాలా: పావుటీస్పూను, ఉప్పు: తగినంత, అల్లంవెల్లుల్లి: టీస్పూను
తయారుచేసే విధానం
టొమాటోలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
పెరుగుని బాగా గిలకొట్టాలి.
చిలగడదుంపలు బాగా కడిగి పొట్టు తీసి ముక్కలుగా కోసి ఉప్పువేసిన నీళ్లలో వేసి ఉంచాలి.
ప్రెషర్‌ పాన్‌లో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఇంగువ, పసుపు, దనియాల పొడి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు టొమాటో-మిర్చి ముద్ద, కారం వేసి కలిపి నూనె తేలేవరకూ వేయించాలి. తరవాత చిలగడదుంప ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగాక సుమారు ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు బాగా గిలకొట్టిన పెరుగు కూడా వేసి మరిగించాలి.
తరవాత ఉప్పు వేసి మూతపెట్టి ఓ విజిల్‌ రానివ్వాలి. ఆవిరిపోయాక మూతతీసి సిమ్‌లో నాలుగు నిమిషాలు ఉడికించాలి. తరవాత గరంమసాలా, కొత్తిమీర తురుము వేసి కలిపి ఓ నిమిషం ఉంచి దించాలి.

పాలక్‌ ఇన్‌ కార్న్‌ గ్రేవీ

కావలసినవి:
పాలకూర: 2 కట్టలు, మొక్కజొన్న పొత్తులు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, పాలు: కప్పు, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, ఎండుమిర్చి: ఒకటి, కరివేపాకు: కట్ట

తయారుచేసే విధానం: 
* మొక్కజొన్న గింజల్ని కచ్చాపచ్చాగా రుబ్బాలి. 
* బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఉల్లిముక్కలు కూడా వేసి వేగాక మొక్కజొన్న గింజల ముద్ద వేసి కలిపి కాసేపు ఉడికించాలి. తరవాత పాలు పోసి కలపాలి. సన్నగా తరిగిన పాలకూర, ఉప్పు వేసి అది ఉడికే వరకూ ఉంచాలి. ఇది రోటీల్లోకీ బాగుంటుంది.

పాలకూర, మొక్కజొన్న గింజల కూర

కావల్సినవి:
పాలకూర తరుగు - కప్పు, మొక్కజొన్న గింజలు - కప్పు, ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి - రెండుచొప్పున, ఆవాలు, జీలకర్ర - చెంచా చొప్పున, పల్లీపొడి - చెంచా, ఉప్పు - తగినంత, నూనె - టేబుల్‌స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా.
తయారీ:
బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేయాలి. అందులో ఆవాలూ, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. అవి వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు చేర్చాలి. ఉల్లిపాయ ముక్కల్లో తడిపోయాక అల్లంవెల్లుల్లి ముద్ద, పాలకూర తరుగూ, మొక్కజొన్న గింజలూ వేసేయాలి. మంట తగ్గించి రెండుమూడు నిమిషాలు వేయిస్తే తేమ పోతుంది. అప్పుడు సరిపడా ఉప్పూ, కాసిని నీళ్లు పోసి మూత పెట్టేయాలి. కాసేపటికి పాలకూరతోపాటూ మొక్కజొన్న గింజలూ ఉడుకుతాయి. చివరగా పల్లీపొడి కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.

దహీబడే

కావల్సినవి:
సెనగపిండి - రెండున్నర కప్పులు, ఆవాలు - టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి - పది, పెరుగు - లీటరు, పుదీనా, కొత్తిమీర - కట్ట చొప్పున, పసుపు - తగినంత, ఉప్పు - తగినంత, వంటసోడా - అరచెంచా, నూనె - వేయించేందుకు సరిపడా, కరివేపాకు రెబ్బలు - ఐదారు, ఎండుమిర్చి - ఐదు, జీలకర్ర - చెంచా.
తయారీ:
సెనగపిండిని ఓ గిన్నెలోకి తీసుకుని అందులో తగినంత ఉప్పూ, వంటసోడా కలపాలి. తరవాత నీళ్లు పోసుకుంటూ మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి.. వేయించేందుకు సరిపడా నూనె వేడిచేయాలి. అందులో ముందుగా కలిపి పెట్టుకున్న సెనగపిండిని ఉండల్లా చేసి దానిలో ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఓ గిన్నెలో గిలకొట్టి ఉప్పు కలిపిన పెరుగూ, పుదీనా ఆకులూ, కొత్తిమీర తరుగూ, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. మరో బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా, ఎండుమిర్చీ, కరివేపాకు రెబ్బలూ వేయించాలి. పొయ్యి కట్టేశాక పసుపు వేయాలి. ఈ తాలింపును పెరుగులో వేసి కలపాలి. చివరగా ముందుగా చేసుకున్న సెనగపిండి ఉండల్ని వేస్తే చాలు.

నువ్వులకూర

కావలసినవి
గోరుచిక్కుడుకాయలు: పావుకిలో, తెల్లనువ్వులపొడి: పావుకప్పు, ఎండుకొబ్బరితురుము: 3 టీస్పూన్లు, కారం: అరటీస్పూను, కొత్తిమీర తురుము: కొద్దిగా, పచ్చిమిర్చి: మూడు, అల్లంవెల్లుల్లి: అరటీస్పూను, మినప్పప్పు: టీస్పూను, ఎండుమిర్చి: నాలుగు, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, కరివేపాకు: 4 రెబ్బలు, పసుపు: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం
ముందుగా గోరుచిక్కుడు కాయలను పసుపు వేసి ఉడికించి వాటి ఈనెలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి.
పాన్‌లో నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి వేసి వేగాక, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. తరవాత గోరుచిక్కుడుకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, నువ్వులపొడి, అరకప్పు నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా ఎండుకొబ్బరి తురుము, కొత్తిమీర తురుము వేసి కలిపి దించితే గోరుచిక్కుడు నువ్వులకూర రెడీ. ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది.

ఆలూ కోఫ్తా కర్రీ

కావల్సినవి:
కోఫ్తాల కోసం: ఉడికించి, మెత్తగా చేసిన ఆలూ ముద్ద - అరకప్పు, పనీర్‌ - అరకప్పు, మొక్కజొన్ నపిండి - టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి ముక్కలు - టేబుల్‌స్పూను, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా. 
మసాలా కోసం: ఉల్లిపాయలు - కప్పు, అల్లం, వెల్లుల్లి ముక్కలు - రెండు చెంచాల చొప్పున, జీడిపప్పు పలుకులు - రెండు టేబుల్‌స్పూన్లు.
ఇతర పదార్థాలు: కారం - చెంచా, టొమాటో గుజ్జు - రెండు కప్పులు, జీలకర్రపొడి - చెంచా, గరంమసాలా - అరచెంచా, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, కసూరీమేథీ - చెంచా, తాజా క్రీం -పావుకప్పు, ఉప్పు - తగినంత. 

తయారీ:

ముందుగా మసాలా కోసం తీసిపెట్టుకున్న పదార్థాలన్నింటినీ మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఆ తరవాత కోఫ్తా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలిపి ఉండల్లా చేసుకోవాలి. వీటిని నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి టొమాటో గుజ్జును వేయాలి. పచ్చివాసన పోయి నూనె పైకి తేలాక జీలకర్రపొడి, గరంమసాలా, కసూరీమేథీ, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాలయ్యాక ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలాను కూడా వేయాలి. గ్రేవీ అంతా సిద్ధమయ్యాక వెన్న, క్రీం కలిపి.. రెండు నిమిషాల తరవాత వేయించి పెట్టుకున్న కోఫ్తాలను వేసి పొయ్యి కట్టేయాలి. కమ్మని కోఫ్తాకర్రీ సిద్ధం.

కూరగాయలతో కిచిడీ

కావల్సినవి:
బియ్యంరవ్వ - రెండు కప్పులు, సెనగపప్పు - కప్పు, పెసరపప్పు - అరకప్పు, పాలకూర - కట్ట, క్యారెట్‌ - రెండు, బీన్స్‌ - ఆరు, టమాటాలు - రెండు, బంగాళాదుంప - ఒకటి, క్యాప్సికం - ఒకటి, కారం, ధనియాలపొడి - రెండు చెంచాలచొప్పున, పసుపు - అరచెంచా, జీలకర్ర, ఆవాలు - చెంచా చొప్పున, కరివేపాకు - రెండు రెబ్బలు, నెయ్యి - అరకప్పు, ఉప్పు - తగినంత.
తయారీ:
సెనగపప్పు, పెసరపప్పును కడిగి ఒక కూత వచ్చేదాకా కుక్కర్‌లో ఉడికించాలి. కూరగాయల్ని సన్నగా తరిగి ఓ గిన్నెలో విడిగా ఉడికించుకోవాలి. అవి మూడొంతులు ఉడికాక.. ముందుగా ఉడికించిపెట్టుకున్న పెసరపప్పు, సెనగపప్పు చేర్చాలి. ఆ తరవాత బియ్యంరవ్వ, రెండుకప్పుల నీళ్లు, పసుపు, ఉప్పు, కారం, ధనియాలపొడి ఒకదాని తరవాత ఒకటి వేసి మూతపెట్టేయాలి. రవ్వ పూర్తిగా ఉడికాక.. బాణలిలో నెయ్యి వేడిచేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయించి కిచిడీలో వేయాలి. ఇది పొడిపొడిగా ఉండదు.

ఓట్స్‌ కిచిడీ

కావలసినవి
ఓట్స్‌: కప్పు, పెసరపప్పు: అరకప్పు, కూరగాయలముక్కలు (క్యారెట్‌, బీన్స్‌, పచ్చిబఠాణీలు): కప్పు, మెంతి ఆకులు: అరకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, అల్లంతురుము: టీస్పూను, కరివేపాకు: కొద్దిగా, పసుపు: పావుటీస్పూను, ఆలివ్‌ ఆయిల్‌: 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయముక్కలు: అరకపు, నీళ్లు: 4 కప్పులు
తయారుచేసే విధానం

పెసరపప్పులో రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. సగం ఉడికాక దించి పక్కన ఉంచాలి. పాన్‌లో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత అల్లంతురుము, మెంతి ఆకులు వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. మిగిలిన కూరగాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. రెండు కప్పుల నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉడికించాలి. నీళ్లు మరిగాక ఓట్స్‌, సగం ఉడికించి పక్కన ఉంచిన పెసరపప్పు నీళ్లతోసహా వేసి కలపాలి. మిశ్రమాన్ని సిమ్‌లో ఉడికించి దించాలి.

వెజిటబుల్‌ రైస్‌

కావల్సినవి: 
బియ్యం - రెండుకప్పులు, అల్లంవెల్లుల్లి ముద్ద -రెండు చెంచాలు, బంగాళాదుంప - ఒకటి, క్యారెట్‌ - నాలుగు, క్యాలీఫ్లవర్‌ - ఆరు పువ్వులు, ఉల్లిపాయ - ఒకటి, క్యాబేజీ తరుగు - అరకప్పు, కారం - కొద్దిగా ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, గరంమసాలా - రెండు చెంచాలు, జీలకర్ర - చెంచా, నూనె - నాలుగైదు చెంచాలు. 
తయారీ:
కూరగాయల్ని సన్నగా తరగాలి. బాణలిలో నూనె వేడిచేసి అందులో జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద, వేయించాలి. మూడు నిమిషాలయ్యాక బంగాళాదుంప, క్యారెట్‌ తురుము, క్యాబేజీ తరుగు, క్యాలీఫ్లవర్‌, ఉల్లిపాయముక్కలు చేర్చాలి. ఇప్పుడు పసుపు, గరంమసాలా, కారం, ఉప్పు వేసి కడిగిన బియ్యం వేయించాలి. ఐదు నిమిషాలయ్యాక సరిపడా నీళ్లు చేర్చి కుక్కర్‌లో ఉడికించాలి.. వెజిటబుల్‌రైస్‌రుచే వేరు.
ఇలా మేలు: ఇది అల్పాహారంగా కన్నా. మధ్యాహ్నం భోజనాల సమయంలో తీసుకోవచ్చు. అదనంగా కూర ఉండదు కాబట్టి నూనె వాడకం తక్కువవుతుంది. కూరగాయల మోతాదును ఇంకాపెంచుకుంటే.. సమతులాహారం అందినట్లే. 

చిక్కుడు - పెసరపప్పు కూర

కావలసినవి
చిక్కుడుకాయ ముక్కలు: 2 కప్పులు, పెసరపప్పు: కప్పు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, నూనె: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: చిటికెడు, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, సెనగపప్పు: టీస్పూను, ఎండుమిర్చి: మూడు, మినప్పప్పు: టీస్పూను, నువ్వులపొడి: టీస్పూను, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను
తయారుచేసే విధానం
చిక్కుడుకాయ ముక్కల్ని ఉడికించి ఉంచాలి. పెసరపప్పుని రెండు గంటల ముందుగానే నానబెట్టి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. తరవాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిముక్కలు కూడా వేసి వేగాక చిక్కుడు ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి కలిపి సిమ్‌లో మూతపెట్టి మగ్గనివ్వాలి. దించేముందు కొత్తిమీర తురుము చల్లితే సరి.